telugudanam.co.in

      telugudanam.co.in

   

అభినయం

మానవుడు ఒక పనిని నిర్వర్తించడానికి ముందు ఉచ్చ్వాస నిస్వాసాలు, చేష్ట లేక కదలిక ముఖ్యం. కదలిక మానవుని సజీవ లక్షణం. కదలిక లేనప్పుడు మానవునికి, చెట్లు చేమలకి భేదం కనిపించదు. అభినయం, నాట్యం రెండూ ప్రాధమిక దశలో చేష్ట ప్రాతిపదికగా ఏర్పడినవే. ఇది రానురాను ఒక కళగా రూపొందింది. ఈనాటి అభినయ కళకుగానీ, నాట్య కళకుగానీ ఆదిమ దశలో మానవ శరీరావయవాల వివిధ చేష్టలు, విన్యాసాలు ముఖ్యాధారం. అతి ప్రాచీన కాలంలో మానవుడు తన దుఖం, విచారం, సంతోషం, ఆనందం, ఆశ్చర్యం, మోహం మొదలైన మానసిక భావాలను వివిధ రకాల కూతలతో, కేకలతో తెలియజెప్పేవాడు. వీటినే మరింత విశదంగా తెలియజెప్పడానికి అంగ విన్యాసాలను, సౌంజ్ఞలను, సంకేతాలను అవలంబించేవాడు.

ఒక నిర్దిష్టమైన భాష సహాయంతో చెపగలిగే విషయాన్ని ఈ అంగ విన్యాసాలు తెలుయజేస్తాయి. ఇట్టి అంగ విన్యాసాలను సౌజ్ఞ భాష అంటారు. ఆదిమ మానవుడు రాను రాను తన మనోభావాలను నాలుకతో, నోటితో, కంఠ నాళముల సహాయంతో తెలియజేయడానికి ప్రయత్నించి మాటల రూపంగా ఉచ్చారణా శక్తిని అభివృద్ధి చేసుకున్నాడు. మానవునికి అతి సన్నిహితంగా ఉండే జంతువులలో కూడా అంగ విన్యాసాలుంటాయి. వీటిలో తరతమ భేదాలున్నా సహజంగా ఇవన్నీ ఒకటే రకం. ఆదిమ కాలపు సౌజ్ఞా సంబంధమైన భాషే నోటితో ఉచ్చరించగల భాషగా మారింది. అతి సహజమైన ఈ ప్రక్రియలు కాలగతిని పరిపూర్ణమైన ప్రవృద్ధిని పొందాయి. అభినయం కూడా మొట్టమొదట అంగ విన్యాసాల మీద, మాటల ఉచ్చారణల మీద ఆధారపడి ఉండేది. ఇవి ఒక్క మనోభావాలను మాత్రమే తెలియజేశాయి. ఆదిమ సమాజ జీవనంలో మానవులు పరస్పరం తమ మనోభావాలను ఇతరులకు విదితం చేయడానికి ఇట్టి అభినయమే ఒక ముఖ్య మార్గంగా ఏర్పరచుకున్నారు. ఇదే నేటి నాట్య కళకు మూలం.


అబినయం

భారతీయ సంప్రదాయం ప్రకరం ఈ కోవకు చెందిన అభినయం నృత్యం (భావాశ్రయం నృత్యం) అని చెప్పబడుతోంది. తరువాతి దశలో నాగరికత అభివృద్ధి పొందిన కొద్దీ మానవుడు తన భావనీ కౌశలం చేత, కల్పనా నైపుణ్యం చేత ఈ అంగవిక్షేపాలను, విన్యాసాలను మరింత భావస్ఫుటంగా, సక్రమ చందోబద్ధంగా లలితమైన కళగా తీర్చిదిద్దగలిగాడు. ఇది ముఖ్యంగా తాళ, లయానుబద్ధంగా నాట్యం చేయడమేతప్ప మనోభావలనుగానీ, అనుగుణ్యమైన రసాలనిగానీ ప్రదర్శించలేదు. వీటియందు ముఖ్యంగా ఒక లక్ష్యంగానీ, ఉద్దేశ్యంగానీ లేకుండా శరీరాన్ని, వివిధ అంగాలను అతి లలితంగానూ, సరసంగానూ కదల్చడం మాత్రమే కనిపిస్తాయి. దీనిని ఆధునిక చిత్ర కళతో పోల్చవచ్చు. వివిధ వర్ణాలతో సమకూర్చిన వర్ణ సౌందర్యం, అభినయం లేక నాట్యం ముఖ్య ముఖ్య ఉద్దేశం-సౌందర్యాన్ని వివిధ భంగిమలతో అతి లలితంగా ప్రస్ఫుటం చేయడమే. దీనిని నృత్తం (నృత్తం తాళ లయాశ్రయం) అంటారు.

అభినయ కళలో నృత్తం, నృత్యం అని రెండు రకాలున్నాయి. ఈ రెండూ ప్రాచీన భారతదేశంలో రెండు విధాల అభినయంగా ఉండేవి. ఇప్పటికీ ఈ అభినయం కథాకళి, కథక్ అని రెండు రకాలుగా ప్రచారంలో ఉంది.

అభినయం తిరిగి తాండవం, లాస్యం అని రెండు విధాలుగా విభజించబడింది. తాండవం పౌరుషంగా, ఉగ్రంగా ఉండడం వలన ఇది శివపరంగా ఉంటుంది. పరమశివుని అనుచరుడైన తాండు 108 భంగిమలను విశదీకరించాడు కాబట్టే దీనిని తాండవం అంటారు. ప్రరమశివుని భార్య పార్వతీదేవి ప్రకటించిన శృంగారాభినయం లాస్యం. భారతీయ అభినయాలు, నృత్యాలు కూడా మనోభావాలకు అనుగుళంగా వివిధ భంగిమలను, అంగ విక్షేపాలను ప్రకాశింపజేస్తాయి.

భారతీయ నాటక కళ, నాట్య కళ పరిపూర్ణంగా అభివృద్ధిని పొందుటకు ముందు సమాజంలో నాటకం-నాట్యం పరస్పరం ఒకదానికొకటి పరిపూరకంగా పరిణామం పొంది రెండూ సంస్కృత మూలం నట్, నృత్ అనే శబ్దాల నుండి ఏర్పడ్డాయి.

నాట్య కళను సరసతాళలయానుబద్ధమైన, చైతన్యవంతమైన దివ్య కళగా రూపొందించడానికి అభినయం చేసేవారు అనుసరించవలసిన నియమాలను, నిబంధనలను ఏర్పరచారు. నాట్య కళను, నాటక కళను శాస్త్రయుక్తంగా బోధించే అతి ప్రాచీన ఉత్తమ గ్రంధం భరతుని భరత నాట్య శాస్త్రం. నందికేశ్వరుని అభినయ దర్పణం దీనికి సంబంధించిన మరో శాస్త్ర గ్రంథం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: