telugudanam.co.in

      telugudanam.co.in

   

నిజమైన స్నేహితుడు

పరీక్షిత్‌, గోపీనాధ్‌ మంచి స్నేహితులు. ఒకరిని వదిలి ఒకరు ఒక్క క్షణం కూడా విడిచి ఉండేవారు కాదు.

ఒకరోజు పరీక్షిత్‌, గోపీనాధ్‌లు కలిసి పొరుగూరికి వెళుతున్నారు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ దట్టమైన అడవి మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఒక ఎలుగుబంటి అరుపు వినిపించింది. అది ఆ దగ్గరలోనే ఉన్నట్టు ఆకులు గలగలలాడాయి. భయంగా స్నేహితులిద్దరూ ముఖాలు చూసుకున్నారు. వాళ్ళు ఊహించినట్టుగానే పక్కనున్న పొదల్ని తప్పించుకుంటు ఎలుగుబంటి రావడం కనిపించింది. గోపీనాధ్‌ గబుక్కున చెట్టెక్కిపోయాడు. చెట్టు ఎక్కడం రాని పరీక్షిత్‌ గోపీనాధ్‌ను సహాయం కోరాడు. కాని గోపీనాధ్‌ సహాయం చెయడానికి ముందుకు రాలేదు. ఏమీ తోచక పరీక్షిత్‌ భయంగా నిలబడిపోయాడు. "ఎలుగుబంటి చాలా దగ్గరగా వచ్చేస్తోంది. ఆపద నుండి బయటపడడం ఎలా?" ఒక పక్క భయపడుతూ, మరో పక్క ఆలోచించాడు పరీక్షిత్‌. అడవి జంతువులకు సంబంధించి తను విన్న విషయాలు గుర్తుకుతెచ్చుకున్నారు. "క్రూరమృగాలు చనిపోయిన శరీరాలను గాయపరచవు" అని తన తాతయ్య చెప్పిన సంగతి స్ఫురించింది. వెంటనే పరీక్షిత్‌ నేలమీద పడుకుండిపోయాడు.

ఎలుగుబంటి పరీక్షిత్‌కి దగ్గరగా వచ్చింది. అతని ముఖం దగ్గర ముఖం పెట్టి చూసింది. పరీక్షిత్‌ ఊపిరి బిగపట్టాడు. ఎలుగుబంటి అతన్ని నేలపైన అటూ ఇటూ దొర్లించింది. చుట్టూ తిరిగి మళ్ళీ ఒక్కసారి అతని ముఖం దగ్గర వాసన చూసింది. అతడు చనిపోయాడని నమ్మింది.కాసేపటి తరువాత ముందుకు వెళ్ళిపోయింది. ప్రమాదం లేదని నిశ్చ్యించుకున్నాక నెమ్మదిగా కిందికి దిగాడు గోపీనాధ్‌. పరీక్షిత్‌ని తట్టి లేపాడు. "హమ్మయ్య! గండం గడిచింది" అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు పరీక్షిత్‌.

"నీ చెవిలో ఎలుగుబంటి ఏం చెప్పింది?" ఆసక్తిగా అడిగాడు గోపీనాధ్‌. అతని ప్రవర్తనవల్ల బాధపడ్డ పరీక్షిత్‌ "స్వార్ధపరులైన వారితో స్నేహం చెయకూడదని ఎలుగుబంటి ఉపదేశం ఇచ్చింది" అని చెప్పి ముందుకు కదిలాడు.


నీతి : కష్టాలలో తోడు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: