telugudanam.co.in

      telugudanam.co.in

   

ఒక గ్లాసుపాలు

ఒకరోజు ఒక పేద బాలుడు తన పాఠశాల ఫీజు, పుస్తకాల కోసం ఇల్లిల్లూ తిరుగుతూ వంటసరుకులు అమ్మసాగాడు. మిట్టమధ్యాహ్నం వేసవికాలం కావడంతో అతని కడుపులో ఎలకలు గిరగిరా తిరగసాగాయి. ఒక ఇంట్లోకి వెళ్ళి కాస్త భోజనం పెట్టమని అడగాలని అనుకుని ఆ ఇంటి తలుపు తట్టాడు. ఇంట్లో నుంచి ఒక యువతి బయటకు రావడంతో భోజనానికి బదులుగా ఒక గ్లాసు మంచినీరు మాత్రమే అడిగాడు బాలుడు. బాలుడు ఆకలితో ఉన్నట్లు కనిపించడంతో ఆమె అతనికి ఒక గ్లాసు నిండా పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పాలు తాగిన బాలుడు "ఈ పాలకు నేను మీకెంత చెల్లించాలి?" అని అడిగాడు. "ఏమీ వద్దు" అని బదులిచ్చింది ఆ యువతి. "మా అమ్మ మనం చేసిన మంచి పనికి ఫలితాన్ని, డబ్బుని ఆశించవద్దు అని చెప్పింది" అని వివరించింది యువతి. "అయితే నేను మనస్పూర్తిగా మీకు కృతజ్ణతలు చెప్తున్నాను" అని అక్కడ నుంచి వెళ్ళి పోయాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యువతి తీవ్రంగా జబ్బు పడింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో ఆమెను వారు వైద్యం కోసం పెద్ద నగరానికి పంపించారు. డా.హోవర్డ్‌ కెల్లీని ఆమెకు ఆపరేషన్‌ చేసేందుకు ప్రత్యేక వైద్య నిపుణుడిగా ఆహ్వానించారు. ఆమె ఏ నగరం నుంచి వచ్చిందో తెలుసుకున్న కెల్లీ ఆనందభరితుడై ఆమె ఉన్న గదిలోకి డాక్టర్‌ గౌనులో వెళ్ళి చూశాడు. ఒకే చూపులో ఆమెను గుర్తించాడు కెల్లీ. ఆమెను కాపాడేందుకు తన శాయశక్తులా పోరాడాలని నిర్ణయించుకున్నాడు.

సుదీర్ఘ పోరాటం అనంతరం డా. కెల్లీ ఆమెను బతికించగలిగాడు. కెల్లీ ఆమె వైద్య ఖర్చులు చీటీని తన వద్దకు పంపమని ఆసుపత్రి వర్గాలను కోరాడు. ఆ చీటీ మీద ఏదో రాసి ఆమె గదికి పంపాడు కెల్లీ. తనను బతికించినందుకు ఎంత డబ్బు అడుగుతారో, తన మొత్తం జీవితం తాకట్టు పెట్టయినా ఆ డబ్బు చెల్లించగలనో లేదో అని భయంతో, వణుకుతున్న చేతులతో ఆ చీటిని తెరిచి చూసింది ఆమె.

చీటి అంచున ఇలా రాసుంది - "ఒక గ్లాసుపాలు మీ ఋణాన్ని తీర్చేశాయి - డా. హోవర్డ్‌ కెల్లీ".


నీతి : మేలు చేస్తే మేలు పొందుతారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: