telugudanam.co.in

      telugudanam.co.in

   

సామెతల భావాలు (కొన్ని)

దానం చెయ్యని చెయ్యీ, కాయలు కాయని చెట్టూ ఒకటే

మనిషన్న తరువాత మమత ఉండాలి.సాటి మనిషి గురించి ఆలోచించాలి.అవసరమున్నంత మేర, మన శక్తి కొద్దీ, సహాయసహకారాలు ఏదో ఓ రూపంలో అందించాలి. ఇదీ ఈ సామెత అంతరార్ధం. కాయలు లేని చెట్టును ఎవరూ గుర్తించరు. అదే విధంగా దాన గుణం లేని వారిని మంచివారుగా సమాజం అంగీకరించదు.

ఎందుకంటే ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. మన సంపాదన ఏరీతిగా, వినియోగపడ్తున్నది కూడా ముఖ్యమే. తనకు మాలిన ధర్మం కూడదు. కానీ కొందరు వారి కున్న సంపద అంతా వృధా అవుతున్నా, ఆకలితో ఉన్న వారికి పట్టెడు మెతుకులు విదిల్చరు. వారిలో పరివర్తనకే ఇటువంటి సామెత.


మూలం - వార్త దినపత్రిక, తేది - డిసెంబర్ 15, 2005.


దున్న ఈనిందంటే దూడను కట్టేయమనట్టు

ఇది జనపదాల్లో పుట్టిన సామెత. వ్యవసాయంతో పాటు పశుపోషణ గ్రామీణులకు అలవాటయిన పని. అందుకే ఈ విషయాన్ని ఉదాహరిస్తూ చెప్పిన సామెత ఇది. లోకంలో కొందరి వింత ప్రవర్తనను మనకు పరిచయం చేస్తుంది. అసలు ఇది నిజమా! కాదా! అన్న విషయాన్ని, గమనించకుండా కొందరు ఉత్సాహం చూపిస్తారనే వ్యంగ్యం ఇందులో ఉంది. నిజానికి, దున్న ఈనదు - దూడ పుట్టదు అన్న నిజం నిదానంగా ఆలోచిస్తే తెలుస్తుంది. కానీ, కొందరి తొందరపాటో, అమాయకతో ఇటువంటి మాటలకు దారితీస్తుంది. పని చెప్పటమే తప్ప, నిజమా, కాదా అని ఆలోచించని యజమాని వింత ప్రవర్తనకు మరో రూపమిది.


మూలం - వార్త దినపత్రిక, తేది - డిసెంబర్ 22, 2005.


నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు

దేవుడు అంటే కొందరికి నమంకం లేకపోవచ్చు. అయితే పరమాత్మ కన్న అంతరాత్మ మరింత ముఖ్యం. ప్రతి మనిషి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదోక్క్కటే మనకు చక్కని మార్గం చూపిస్తుంది. రాను చేసిన పనుల్నీ ఆత్మతో చర్చించుకోవాలి. మన నడవడి ఎలా ఎఉదో ఆత్మతో సంప్రదించాలి. అప్పుడు మనకెన్నో నిజాలు తెలుస్తాయి. ఇక దైవాన్ని నమ్మేవాళ్ళు తప్పక తమ ప్రవర్తన దేవుడు గమనిస్తున్నడని తెలుసుకోవాలి. మనల్ని మనల్ని ఎవరూగమనించడం లేదని, దుడుకు చేష్టలు, అన్యాయాలు, చేస్తూ పోతే, దేవుడు శిక్షిస్తాడని నమ్ముతారు. అందువల్ల నీరు, పల్లానికి పారడం ఎంత సహజమో, మనకు తెలియని అనేక విషయాలు (నిజాలు) దైవానికి తెలియటం కూడా అంతే సహజమని ఈ సామెత చేబుతుంది.


మూలం - వార్త దినపత్రిక, తేది - సెప్టెంబర్ 28, 2005


నక్క ఎక్కడ, నాగలోక మెక్కడ?

కోతల కోసే వాళ్ల కొంటె చేష్టను, ఓ నక్కబావకు అంటగట్టి దాని వల్ల ఎంత నష్టం కలిగుతుందో వివరిస్తుంది ఇది.

కుటిల నీతికి, వక్రబుద్ధికి, మరో రూపంగా నక్కను పోలిక చెబుతారు. 'వాడు నక్క ' అంటే అర్ధం వాడి బుద్ధి మంచిది కాదనే. అటువంటి ఓ నక్క తాను బొందితో స్వర్గం వెళ్లినట్టుగా కట్టుకథ చెప్పి, తన పబ్బం గడుపుకుంటుంది.

నిజానికి నక్క ఉండేది భూ లోకం పైన, పైగా ఓ జంతువు ఇదెలా సాధ్యం. లోకంలో సాధ్యా సాధ్యాలు కూడా వివరించకుండా జనం ఎదుటివాళ్లను గుడ్డిగా నమ్ముతారని చెప్పటానికి ఈ సామెత చక్కని ఉదాహారణ. అంతే కాదు వినే అమాయకులుంటే ఎంత గొప్ప కోతలు కోయవచ్చో కూడా చబుతోంది. కథలో నక్క కేవలం పాత్ర మాత్రమే. ఇక్కడ లౌకిక జీవనంలో మానవ మనస్తత్వానికి సంకేతంగా గమనించాలి.


మూలం - వార్త దినపత్రిక, తేది - జులై 26, 2006.


నక్కలలో నక్కగా నటించవలె

సమాజంలో పలురకాల మనస్తత్వాలు గల వ్యక్తులుంటారు. వారిలో మోసకారులు, అమాయకులు, ధార్మికులు, వంచకులు, నీతివంతులు, ద్రోహులు ఇలా. మరి వీరందరి మధ్య తెలివిగా జీవించకపొతే మన బతుకులు ప్రమాదం అంచున పయనిస్తుంటాయి. మీరు టీవీల్లో, వార్తాపత్రికల్లో చదువుతూనే ఉంటారు. ప్రతి రోజు ఎన్ని మోసలు, కుట్రలు, కుతంత్రాలు, జరుగుతున్నయో. మరి వాటి బారి నుంచి మనల్ని మనమే మన తెలివి తేటల ద్వార, పెద్దల, గురువుల అనుభవ సూక్తులుద్వారా కాపాడుకోవాలి. అందుకే పై సామెతలో చెప్పినట్లు ఎదుటి వ్యక్తి, మనసు లక్షణాన్ని గమనించి వారితో స్నేహం చేయాలి. కొన్ని సందర్భాల్లో, మోసపోయే పరిస్థితి వస్తే తెలివిగా బయటపడాలి. అందుకు అవసరమైతే ఎదుటివ్యక్తిలా నటించాలి, నమ్మించాలి, అనే చక్కని హితవు ఈ సామేతలో ఉంది. నక్కలాంటి వ్యక్తుల మధ్య, అవసరమైతే, అటువంటి లక్షణాల ద్వారా మోసాన్ని మోసం ద్వారానే జయించి ఆపదల నుంచి భద్రంగా బయటపడాలనే హెచ్చరిక ఈ సామెతలో ఉంది.


మూలం - వార్త దినపత్రిక, తేది - జులై 20, 2006.

[ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: