telugudanam.co.in

      telugudanam.co.in

   

గంగిరెద్దు మేళం

ప్రజలను వినోదపరచే కళారూపమిది. గంగిరెద్దులవారికి ఒక వూరనేది లేదు. ముఖ్యంగా సంక్రాంతి పందగ దినాల్లో వీరు వీధుల వెంట బయల్దేరతారు.

వయసులో ఉన్న కోడె గిత్తల్ని మచ్చిక చేసుకుని, తాము చెప్పినట్లు చేసేలా తయారుచేస్తారు. వాయిద్యానికి అనుకూలంగా అడుగులు వేయించడం, మూడు కాళ్ళ మీద నిలబెట్టడం, కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానంగా తల వూపించటం, సలాం చేయమంటే, కాలు పైకెత్తి సలాం చేయటం, ఇలా ఎన్నో ఫీట్లలో శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాటిని వీధిలోకి తీసుకువస్తారు.

గంగిరెద్దులను అలంకరించడంలో వీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వీటిని స్వంత బిడ్డల్లా చూసుకుంటారు. మూపురం నుండి తోక వరకు రంగు రంగులతో కుట్టిన బొంతను కప్పుతారు. కొమ్ములను రంగులతో అలంకరిస్తారు. కొమ్ము చివర ధగ ధగ మెరిసే ఇత్తడి గొట్టాలను తొడుగుతారు. నొసటన తోలు కుచ్చులు కట్టి మూపురాన్ని రంగు పంచెతో అలంకరించి ఒక దండను దిగవేస్తారు. కాళ్ళకు గజ్జెలు కడతారు. సాక్షాత్తూ నందీశ్వరునిలాగా తయారుచేస్తారు. తాము కూడా అలంకారంలో అంతే ఆడంబరంగా కనపడేందుకు వేషధారణ చేస్తారు. సన్నాయి బూర, డోలు, చేతిలో చిన్న గంటతో నెత్తికి రంగుల తల గుడ్డ, పాత కోటు, భుజం మీద కండువా, నుదురున పంగనామంతో ఆకర్షణీయంగా తయరవుతారు.అలంకారాలు పూర్తయిన పిదప మేళతాళాలతో గంగిరెద్దును ఊరంతా తిప్పుతారు. ఎద్దు మెడలో మెడను ఇరికించడం వంటి విన్యాసాలు చేస్తారు. ఇంటింటికీ తిరిగి ధాన్యము, బట్టలు, డబ్బు సంపదించుకుంటారు. ఇలా తాము బ్రతుకుతూ తమ ఎద్దులను బ్రతికించుకుంటూ దేశ సంచారం చేస్తారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: