telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

కచోరీలు (కందులతో)

కావలసిన వస్తువులు:

పచ్చికంది గింజలు - ఒక కప్పు.
గోధుమపిండి - ఒక కప్పు.
మైదాపిండి - ఒక కప్పు.
బంగాళదుంప - ఒకటి.
పచ్చిమిరపకాయలు - నాలుగు.
కారంపొడి - అర టీ స్పూను.
కొత్తిమీర తరుగు - పావు కప్పు..
నెయ్యి లేక డాల్డా - ఒక టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

ముందుగా గోధుమపిండి, మైదా పిండిలలో నెయ్యి లేక డాల్డా, తగినంత ఉప్పు వేసి పూరీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. కందిగింజలు మరుగుతున్న నీటిలో వేసి దించి చల్లారాక నీటిని తీసివేయాలి. బంగాళాదుంపను ఉడికించి చిదిమిపెట్టుకోవాలి. తర్వాత మూకుడులో కొద్దిగా నూనె వేసి కాగాక చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కందిగింజలు, బంగాళాదుంప గుజ్జు, కారంపొడి, చాట్ మసాలా, సోంపు, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి ఉడికించి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దించాలి. తర్వాత నానబెట్టిన పిండిని పూరీల్లా చేసి కూరమిశ్రమాన్ని పూరీపై సర్ది మరో పూరీని పైన ఉంచి చుట్టూ అంచులను మూసివేసి కాగిన నూనెలో వేగించాలి. పుదీనా లేక అల్లం పచ్చడితో తింటే రుచిగా ఉంటాయి.


[ వెనుకకు ]

కచోరీలు (క్యాప్సికమ్‌తో)

కావలసిన వస్తువులు:

కాప్సికమ్ మధ్య సైజువి - అర కేజి.
పుట్నాల పప్పు - 100 గ్రా.
ఎండుమిర్చి - నాలుగు.
ఎండు కొబ్బరి - 25 గ్రా.
ఉప్పు - తగినంత.
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు.
నూనె - తగినంత.

తయారు చేసే విధానం:

మొదట పుట్నాలు శుభ్రం చేసుకుని ఎండుమిర్చి కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కలిపి మిక్సీలో పొడిచేసి ఉంచుకోవాలి. కాప్సికమ్ కడిగి తొడిమల దగ్గర చాకుతో గుండ్రంగా కోసి తొడిమను తీసేసి గింజలన్నిటినీ విదిలించేయాలి. స్టౌ మీద బాణలి ఉంచి కాప్సికమ్‌లన్నీ పేర్చి ఒక గరిటెడు నూనె పైన వేసి అన్నిటినీ అటూ ఇటూ తిప్పుతూ గోధుమరంగు వచ్చే వరకు వేగించి తియ్యాలి. అంతకుముందు చేసిపెట్టుకున్న పొడిలో ఒకస్పూను నూనె వేసి కాస్త తడిపొడిగా కలుపుకోవాలి. ఒక్కొక్క కాప్సికమ్‌లో మూడు లేక నాలుగు స్పూన్ల పొడిని కూరాలి. కాప్సికమ్ విరిగిపోకుండా చూసుకోవాలి. పొడి కూరిన తర్వాత కాప్సికమ్‌లను బాణలిలో పేర్చి రెండు గరిటెల నూనెను అన్ని కాప్సికంస్‌ను అటూ ఇటూ తిప్పుతూ సన్నని సెగ మీద మగ్గించాలి. ఇవి అన్నంలోకి, చపాతీల్లోకి కూడా బాగుంటాయి. దీన్నే మసాలా మార్చి చేసుకోవచ్చు. ఒక చిప్ప కొబ్బరి, 50 గ్రాముల గసగసాలు, ఎండుమిర్చి రెండు, పచ్చిమిర్చి రెండు కలిపి మొత్తగా నూరి ఆ ముద్దను కాప్సికమ్‌లో కూరి వేగించుకున్నా అన్నంలో తినడానికి బాగుంటుంది. అయితే కొబ్బరి ముద్దను మొదట కొద్దిగా నూనె వేసి పచ్చిపోయే వరకు వేగించుకోవాలి.


[ వెనుకకు ]

పొంగలి

కావలసిన వస్తువులు:

బియ్యం - 1కప్పు.
పాలు - ఒక లీటరు.
బెల్లం లేదా పంచదార - 1/4 కిలో.
యాలకుల పొడి - 1/2 చెంచా.
జీడిపప్పులు - 10.
నెయ్యి - 1గరిటెడు.

తయారు చేసే విధానం:

బియ్యం బాగా కడిగి పెట్టుకోవాలి. రెండు కప్పుల నీళ్ళు మరిగించి బియ్యం అందులో వేసి ఉడికించాలి. నీళ్ళు ఇంకుతున్నప్పుడు లీటరుపాలు పోసి బాగా ఉడికించాలి. ఉడుకుతున్నప్పుడే నెయ్యి వేసుకోవాలి. పాలు బాగా చిక్కబడి దగ్గరికి అయిన తరువాత బెల్లం పొడివేసి మరికాసేపు ఉడికించాలి. నేతిలో వేయించిన జీడిపప్పువేసి, యాలకుల పొడి కూడా వేసి స్టౌమీద నుంచి దించాలి.


[ వెనుకకు ]

వెజిటబుల్ వడలు

కావలసిన వస్తువులు:

బంగాళాదుంపలు - పావు కిలో.
క్యారెట్ - ఒకటి.
క్యాబేజి - ఒక కప్పు (తరిగినది).
సగ్గుబియ్యం - 50 గ్రా.
కొత్తిమీర - ఒక కప్పు (తరిగినది).
కారం - ఒక టీ స్పూను.
జీడిపప్పు - 25 గ్రా.
జీలకర్ర పొడి - అర టీ స్పూను.
నూనె వేగించడానికి - సరిపడినంత.
నిమ్మకాయ - ఒకటి.
ఉప్పు - తగినంత.
పసుపు - చిటికెడు.
పచ్చిమిర్చి - నాలుగు.
అల్లం ముక్కలు - 2 టీ స్పూన్లు.
మైదా పిండి - 25 గ్రా.

తయారు చేసే విధానం:

దుంపలు ఉడకపెట్టి పొట్టుతీసి ఉంచాలి. బఠానీలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తరుగు వేటికవే ఒక మాదిరిగా ఉడకనిచ్చి వార్చాలి. తరువాత అన్నింటినీ కలిపి ముద్దగా చేయాలి. సగ్గుబియ్యంలో నీరుపోసి అరగంట నాననిచ్చి నీరు వడకట్టి ఆరబెట్టాలి. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర సన్నగా తరిగి ఉడికించిన కూరల ముద్దలో కలపాలి. జీడిపప్పు కూడా చిన్నచిన్న ముక్కలుగా చేసి అవి కూడా అందులో వేయాలి. ఉప్పు, కారం, జీలకర్ర పొడి, నిమ్మరసం కూడా అందులో వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. మూకుడులో నూనె వేసి బాగా కాగిన తరువాత కూరముద్దను వడలుగా పొడి మైదా పిండిలో దొర్లించి, పైన నానిన సగ్గుబియ్యం అద్ది వేగించాలి. ఇవి వట్టిగానూ తినొచ్చు. ఈ వెజిటబుల్ వడలను చట్నీతో నంజుకునైనా తినవచ్చు.


[ వెనుకకు ]

బజ్జీలు (క్యాప్సికమ్‌తో)

కావలసిన వస్తువులు:

కాప్సికమ్ - అర కేజి.
నూనె - పావు కేజి.
శనగపిండి - పావు కేజి.
మిరప్పొడి - ఒక స్పూను.
జీలకర్ర - ఒక స్పూను.
వంటసోడా - చిటికెడు.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

కాప్సికమ్‌లను కడిగిన తర్వాత చాకు తీసుకుని ఒక్కొక్క దాన్ని నాలుగైదు ముక్కలుగా నిలువుగా తరుక్కోవాలి. గింజలు, తొడిమ తీసేయాలి. శనగపిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, వంటసోడా అన్నీ వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి ఒక్కొక్క కాప్సికమ్ ముక్కను శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వెయ్యాలి. వేగాక తీసి చిల్లీసాస్‌తో వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: