telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

అటుకుల అట్టు

కావలసిన వస్తువులు:

అటుకులు - 1 కిలో.
మజ్జిగ - పావు లీటరు.
బియ్యం - 1 కిలో.
పచ్చిమిర్చి - 10 గ్రా.
జీలకర్ర - 2 చెంచాలు.
తినే సోడా - చిటికెడు.
నూనె - పావు కిలో.
ఇంగువ - తగినంత
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:

మజ్జిగని ఒక పాత్రలో పొయ్యాలి. అటుకుల్ని శుభ్రంగా కడిగి ఆ మజ్జిగలో నానేయాలి. బియ్యం నీళ్ళలో నానేయాలి. బియ్యం బాగా నానిన తర్వాత అటుకులు, బియ్యం మెత్తగా రుబ్బుకొని, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, తినేసోడా వేసి బాగా కలపాలి. పొయ్యి మీద పెనం పెట్టి నూనె రాసి ఈ పిండిని దోసెలు పోసుకొని కాల్చుకోవాలి. ఇవి దళసరిగా వేస్తేనే బాగుంటాయి.


[ వెనుకకు ]


గోధుమ అట్టు

కావలసిన వస్తువులు:

గోధుమ పిండి - పావు కిలో.
నూనె - 100 గ్రా.
పుల్లని మజ్జిగ - తగినన్ని..
పచ్చిమిర్చి - 10.
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు - 2.

తయారు చేసే విధానం:

పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. గోధుమపిండి మజ్జిగలో వేసి బాగా గరిటె జారుగా కలిపి ఉప్పు, మిర్చి ముక్కలు వేసి కలియబెట్టాలి. స్టౌ వెలిగించి పెనం వేడిచేసి, పిండి బాగా కలుపుకొని, అట్టు పొయ్యాలి. ప్రతీ అట్టుకి పిండి బాగా కలుపుతుండాలి. లేకపోతే పిండి అడుక్కు జారిపోయి అట్టువేసేందుకు గరిట్లోకి మజ్జిగతేట మాత్రమే వస్తుంది సుమా!


[ వెనుకకు ]


పెసరట్టు

కావలసిన వస్తువులు:

పెసలు (పొట్టు పెసర పప్పు) - అర కిలో.
చిన్న అల్లం ముక్క - 1.
ఉల్లి పాయలు - 4.
పచ్చిమిర్చి - 15 - 16.
ఉప్పు - తగినంత.
నూనె - తగినంత.

తయారు చేసే విధానం:

పెసలు లేక పొట్టు పెసర పప్పును 3 గంటలు నాన బెట్టలి, నానిన తరువాత వాటిని శుభ్రంగా కడగాలి. పచ్చిపెసల్ని లేక పొట్టు పెసర పప్పును నీళ్ళు చిలకరించుకుంటూ మెత్తగా పిండి రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లి మిర్చి అల్లం ముక్కలు కోసి పిండిలోవేసి రుబ్బేసుకోవాలి. లేదంటే అల్లం ఉల్లి మిర్చి తురుముల్లా తరుక్కొని కాస్త జీలకర్ర కూడా కలిపి అట్లు మీద చల్లి అద్దుకోవచ్చు. సరే ఉప్పువేసి బాగా రుబ్బుకున్నాక పొయ్యి మీద పెనం పెట్టి ఓ పుల్లకి గుడ్డముక్క కట్టి పెనం మీద నూనె వేసి ఆ పుల్లతో పెనమంతా రాయాలి. పెనం మధ్యలో గరిటెడు పిండివేసి, పెనమంతా పాకించాలి. (పిండిలో కలిపి రుబ్బుకోకపోతే) అల్లం, మిర్చి, ఉల్లి ముక్కలు, జీలకర్ర అట్టు మీద చల్లి అట్ల పుల్లతో అట్టుకు అతుక్కునేలా అదుముకోవాలి. లేదా తడిచేత్తో కాస్త ముడిపిండి నందుకొని ముక్కల్ని అదిమితే రాలకుండా ఉంటాయి. పల్చగా వేసుకుంటే అట్టుని తిరగేయాల్సిన పనే ఉండదు.


[ వెనుకకు ]


మినపట్టు

కావలసిన వస్తువులు:

మినపప్పు - అర కేజి.
బియ్యం - 1 కిలో.
నూనె - పావు కిలో.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

దోసెల్ని రేపొద్దున వేసుకోవాలి అంటే ఈ రోజు ఉదయమే పప్పు బియ్యం విడివిడిగా నానేయాలి. సాయంత్రం పప్పు మీద పొట్టుతీసేసి బియ్యం కూడా కలిపి మొత్తం మీద మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పువేసి విశాలమైన పాత్రలో ఉంచి మూతపెట్టాలి. మర్నాడు పొద్దునే స్టౌ వెలిగించడం పెనం కాల్చి నూనె వేసి ఈ పిండిని గరిట జారుగా కలిపి పల్చగా దోసెలు పోసుకోవాలి.


[ వెనుకకు ]


ఉల్లి దోసె

కావలసిన వస్తువులు:

మినపప్పు - అర కిలో.
బియ్యం - 1 కిలో.
నూనె - పావు కిలో.
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు - తగినన్ని.

తయారు చేసే విధానం:

దోసెల్ని రేపొద్దున వేసుకోవాలి అంటే ఈ రోజు ఉదయమే పప్పు బియ్యం విడివిడిగా నానేయాలి. సాయంత్రం పప్పు మీద పొట్టుతీసేసి బియ్యం కూడా కలిపి మొత్తం మీద మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పువేసి విశాలమైన పాత్రలో ఉంచి మూతపెట్టాలి. మర్నాడు పొద్దునే స్టౌ వెలిగించడం పెనం కాల్చి నూనె వేసి ఈ పిండిని గరిట జారుగా కలిపి పల్చగా దోసెలు పోసుకోవాలి. దోసెలు పోసుకొని వాటి మీద ఉల్లిముక్కలు అద్దుకొని కాల్చుకుని తీసుకోవడమే.


మూలం : అన్నపూర్ణ వంటలు, పిండి వంటలు పుస్తకములోనివి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: