telugudanam.co.in

      telugudanam.co.in

   

ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం

ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు పేరిట మూడు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలను కలుపుకొని 1970 ఫిబ్రవరి 2వ తేదీన ప్రకాశం జిల్లాగా ఏర్పాటుచేశారు. స్వాతంత్రోద్యమ కాలంలో పోరాటాల గడ్డగా పేరొందిన ఈ ప్రాంతానికి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ' ఆంధ్రరత్న ' దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు మరెందరో యువ ప్రకాశాలతో, స్వాతంత్ర్య ఉద్యమం ప్రకాశించింది. అందుకే ఈ జిల్లాకు ' ప్రకాశం' గా నామకరణం చేశారు. జిల్లా ఆవిర్భావ సందర్భంగా ఉద్యమాల గడ్డ గురించి స్మరించుకుందాం.


దుగ్గిరాలగోపాలకృష్ణయ్య

1889 జూన్ 2 జన్మించిన దుగ్గిరాలగోపాలకృష్ణయ్య అర్థశాస్త్రంలో ఎం.ఏ పట్టాపొంది దేశభక్తితో 1854 నుంచి సహాయ సమీకరణ, శాసనోల్లంఘన, విదేశీవస్తు బహిష్కరణ తదితర ఉద్యమాలలో ప్రధానపాత్ర పోషించారు. 1920లో చీరాల - పేరాల ఉద్యమం ప్రారంభించారు. 1921లో మార్చి 28న విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రేస్ మహసభ అనంతరం 1921 ఏప్రియల్ 21న మహాత్మాగాంధీ చీరాల వచ్చి 'దుగ్గిరాల ఉద్యమాన్ని కొనియాడారు. దేశభక్తి, ఉద్యమాలు నడుపుతున్నందుకు 19 నెలలు జైలు శిక్ష విధించినా భయపడక 1922 అక్టోబర్ 2న జైలు నుంచి విడుదలై పొన్నూరు కాంగ్రెస్ సభలో ఆంధ్ర రాష్ట్రం అంతటా పర్యటించారు. 1928 జూన్ 10న మరణించారు. ఆంధ్రరత్న పేరుతో విఖ్యాతమైంది


ప్రకాశం పంతులు

1872 ఆగష్టు 23న జన్మించిన ప్రకాశం పంతులు జిల్లా ముద్దుబిడ్డ. చిన్ననాడే తండ్రి మరణంతో లెక్కల మాష్టారు ఇమ్మానేని హనుమంతురావు నాయుడు ప్రొత్సాహం, సహకారంతో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1919లో గాంధీజీ మద్రాసు వచ్చినప్పుడు సత్యాగ్రహ ప్రతిజ్ఞ తీసుకొని ఖద్దరులాల్చి, పంచెధరించి లక్షలాది రూపాయలు సంపాదించి పెట్టే న్యాయవాది వృత్తిని తృణప్రాయంగా వదిలాడూ. తన యావదాస్తిని స్వాతంత్ర్యోద్యమానికి ఖర్చు చేశాడు. 1928లో సైమన్‌కమీషన్ మద్రాసు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి కాల్చండంటూ బ్రిటీష్ సైనికులకు గుండె చూపి 'ఆంధ్రకేసరిగా' గా గుర్తించబడ్డాడు. 1930లో దేవరంపాడు ఉప్పుసత్యాగ్రహం శిభిరంలో పాల్గొన్నాడు. 1946 మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్ర మంత్రిగా పనిచేశారు.


స్వాతంత్ర్యోద్యమంలో ' యువ ప్రకాశం '

1930 నుంచి జిల్లాలో అనేక ఉద్యమాలలోకి యువప్రకాశం ఉరికింది. 1930 దేవరంపాడు ఉప్పుసత్యాగ్రహ శిబిరంలో సాగి విజయరామరాజు, జొన్నలగడ్డ రామయ్య, ఒంగోలు తాలూకాలో సభలు నిర్వహించి యువతను ఉత్తేజపరిచారు. కామేశ్వరరావు, రామయ్య, నరసింహమూర్తి తదితరులు రహస్య అధ్యయన తరగతులు నిర్వహించారు. 1936లో ఒంగోలు తాలూకా యువజన సంఘం ఏర్పాటు చేశారు. 1937 మే 1 నుంచి 10 వరకు చారిత్రక కొత్తపట్నం రాజకీయ పాఠశాల ప్రారంభించారు. దీని స్పూర్తితో యువజన సంఘాలు సమైఖ్యంగా కృషి చేశాయి. రెండో ప్రపంచయుద్ద వ్యతిరేక ప్రచారం పిలుపు నిచ్చారు. సంతనూతలపాడు పిర్కాలో నాగినేని వెంకయ్య, బుడ్డా సుబ్బారామిరెడ్డి, సి.ఎల్.నరశింహం, పీసుపాటి వెంకటరాఘవయ్య, నల్లూరి అంజయ్య తదితరులు ఉద్యమానికి మరింత అండ చేకూర్చారు. కొండపి ప్రాంతంలో గూడా సీతారామయ్య ప్రొత్సాహంతో పి.వి. శేషాచార్యులు, నేలబొట్ల కృష్ణమూర్తి, బూదవాటి వెంకటసుబ్బయ్య, కూనంనేని రాములు, కళ్ళగుంట తిరుపతయ్య, మువ్వరాజు దొంతయ్య, ఆరికట్ల తత్తయ్య ఉద్యమంలోకి ఉరికారు. 1945 ఫిబ్రవరిలో కనిగిరి లో విద్యార్థి ఫెడరేషన్ సభలో దర్శి చెంచయ్య, ఉండవల్లి కృష్ణారావు, కె.ఎల్. నరశింహరావు, లు ఆప్రాంత యువకులను జాగృతం చేశారు.


దక్షిణాది ' దండి ' దేవరంపాడు

టంగుటూరు ప్రకాశం పంతులు ఇచ్చిన అర ఎకరం దానంతో గాంధీ - ఇర్విన్ ఒడంబడికకు అనుగుణంగా నాటి గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపుతో ఒంగోలు మండలం దేవరంపాడులో ఉప్పుసత్యాగ్రహ శిబిరం 1930 లో ప్రారంభమయింది. 400 మంది సత్యాగ్రహ కార్యకర్తలు పోలీసులు లాఠీదెబ్బలకు, అరెస్ట్‌లకు దడవకు శాంతియుతంగా ఉప్పుసత్యాగ్రహ శిబిరం విజయవంతంగా నడిపారు. సాగి విజయరామరాజు నేతృత్వంలో శిబిరం జరిగింది. నిడుబ్రోలు వాలంటీర్లను అమ్మనబ్రోలు వద్ద ఆపారు. వాలంటీర్లకు ఆశ్రయం ఇచ్చినందుకు డాక్టర్ కనపర్తి నారాయణరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కరవది మహిళలు సైతం ఉద్యమకారులకు సహయసహకారాలు అందించారు. వావిలాల గోపాలకృష్ణయ్య, యామిని పూర్ణ ఆలకలకు ఆశ్రయం ఇచ్చిన మరో 15 మందిపై బ్రిటీషు పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉప్పుసత్యాగ్రహ శిబిరం విజయవంతంగా నిర్వహించటంతో దక్షిణాది దండిగా దేవరంపాడు ఖ్యాతినొంది ఇందుకు గుర్తుగా 1935 నవంబరు 21న అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ దేవరం పాడులో విజయస్థూపం నాటారు. ఈ శిబిరాన్ని కొండా వెంకటప్పయ్య, దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, ఎస్.జి.రంగా, జలగం వెంకటప్పయ్య, కె. రోశయ్య వంటి ఎందరో మహానుభావులు సందర్శించారు. అయితే పర్యాటక కేంద్రంగా ఇది అభివృద్దికి నోచుకోకపోవటం విచారకరం.

ఈ విధంగా అనేక ఉద్యమాలలో ప్రకాశం జిల్లా తనకు ప్రత్యేకస్థానాన్ని నిలుపుకొంది. నేటి యువతకు నాటి ఉద్యమస్పూర్తి ఎరిగి జిల్లా అభివృద్దికి దోహదపడతారని ఆశిద్దాం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: