telugudanam.co.in

      telugudanam.co.in

   

ఆందోళనను అరికడదాం

సగటు మానవుడి సాధారణ స్పందనలలో ఆందోళన ఒకటి. వాస్తవానికి ఇది సర్వసాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ ఎదో ఒకనాడు కలిగేదే. ఆందోళన చెందని మనిషి ఉండడం అంటూ జరగదు. ఐతే ఆందోళన చెందే పర్సెంటేజిలోనే ఉన్నది అసలు కథంతా. చిన్నా, పెద్దా ప్రతి సంఘటనకీ స్పందించే మనిషికే ఎన్నో తలనొప్పులు. ప్రతి సంఘటన సంఘర్షణ కాబోదు. అలా అవుతుందేమోనన్న ఆలోచనే ఆందోళనకు గురిచేస్తుంది ఎవరినైనా.ఆందోళన అనేది ఒక మానసిక వ్యాధి. మెదడును తొలుచుకుతినే క్రిమిలాంటిది. శరీరంలోని జీవ శక్తిని ఇది పీల్చేస్తుంది. మనస్సు నీరసపడిపోయి, అంతర్దృష్టి లోపించినప్పుడు మనస్సు అంతే మబ్బులు క్రమ్మేస్తాయి. మనస్సు గాబరాపడిపోతుంది. దుఖంతోనూ, విచారంతోనూ మునిగిపోతుంది. కాబట్టి, ఆందోళన, ఆదుర్దా, దుఖం అన్నీ ఏకమవుతాయి. ప్రతి నిత్యం ఎన్నో అవసరాలు,కోరికలు మనను చుట్టేస్తుంటాయి. ప్రతిదీ అవసరంగానే కనిపిస్తుంటుంది. ఆ అవసరాన్ని సాధించుకోవడంకోసం తీవ్రంగా ప్రయత్నించడం, అది సాధ్యం కాకపోయినప్పుడు తీవ్ర నిరాశకు గురికావడం జరుగుతుంటుంది. అసలు ఆ అవసరమే వద్దనుకుంటే ఆందోళనకు ఆస్కారమే ఉండదు. అవసరాలు ఎక్కువైనకొద్దీ ఆందోళనలు పెరుగుతుంటాయి. కోరికలు,అవసరాలు మాన జీవితంలో నిత్యం పెరుగుతూనే ఉంటాయి. వాటి కళ్ళెం వేయడం తప్ప వాతికోసం ప్రాకులాడితేనే సమస్య అధికం అవుతుంది. లేకుంటే ఆందోళన మనిషి మనుగడకే తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తుంది.

ఆందోళన అనేది కోరికలు, అవసరాలకు మాత్రమే చెందినదైతే కొంతవరకు పరవాలేదుగానీ ప్రతిదానికీ ఆందోళన చెందడమే తీవ్ర మానసిక సంఘర్షణకు గురిచేస్తుంది. ఎంతో కష్టపడి చదివి పరీక్ష సరిగ్గా రాస్తానో లేదోనన్న ఆందోళన విద్యార్ధి జీవెతంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. సంవత్సరమంతా అతను కష్టపడి చదివినా తాలి పరీక్ష రాయాల్సిన ఆ మూడు గంటలు ఆందోళనకు గురైతే ఆ సంవత్సరం చదువు వృధానే. ప్రయాణం చేస్తూ గమ్యానికి కరెక్ట్ టైముకి చేరుకుంటానా లేదా అనే ఆలోచన మరొకటి. ప్రయాణీకుడు ఎంత ఆందోళన చెందినా రైలు తన గమ్యానికి చేరుకోవాల్సిన టైములోనే చేరుకుంటుంది తప్ప ఆ ప్రయాణీకుడు ఆందోళన చెందుతున్నాడనై అతను కోరుకున్నట్లు నడవదు. ఆ ఆలోచన ఆ ప్రయాణీకుడిలో కలిగితేనే అతని ఆందోళనకు పుల్‌స్టాప్ sపడుతుంది. ఆ దృక్పధంతో ఆ ప్రయాణీకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి.

ఆందోళన అనేది మనసుకు తెలిసి జరగదు. అది మనసులో పెరిగిపోతూనే ఉంటుంది. రోజూ కష్టపడి పని చేస్తూ ఈ ఆదివారం బాగా విశ్రాంతి తీసుకుందాం అనుకున్న రోజున ఏదైనా చిన్న పని పడితే చిరాకు పుడుతుంది. కనీసం ఈ రోజైన ఈ దేహానికి విశ్రాంతి దొరకలేదే! వెధవ బ్రతుకు! అని సహజంగా అంకుంటుంటారు చాలామంది. సేద తీరుచుకోవాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక చిన్న సమస్య ఇలా ఏర్పడుతుంటే విసుగు పుట్టకమానదు. ఐతే ఆ విసుగును తొలగించుకునేందుకు ప్రయత్నించాలేతప్ప పదే పదే ఆ సమస్య గురించే ఆలోచిస్తూ ఉంటే ఆందోళన కలగక మానదు. దీన్ని అరికట్టాలంటే ముందుగా దాన్ని మనసులోనుంచి బలవంతంగా బైటికి నెట్టేందుకు ప్రయత్నం చెయ్యాలి. అదెలా పోతుందో దానికి మార్గాలు అన్వేషించాలి.

మనసు ఆందోళనకు గురైనప్పుడు కొందరు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. వారిలో రుణాత్మకభావం నైరాశ్యంలోనే ప్రవర్తింపజేస్తుంది. సరిగ్గా చెప్పాలంటే అది పాము నోటి దగ్గర కప్పలాంటిది. కప్పకు తెలుసు పాము తనను మ్రింగేస్తుందని. కానీ చూపులతో వ్యామోహం చెంది ముందుకు గెంతుతుంది. ఇది గొప్ప ప్రమాదం. దాన్ని నివారించుకోవాలి. కష్టాలను పదే పదే గుర్తుకు తెచ్చుకోకుండా ఉండటం ఆందోళనను అరికట్టుకునే ఒక మార్గం. ఇందుకు మనసుకు విరామం లేకుండా ఏదైనా పని పెట్టుకోవాలి. ఏదో ఒక ఆందోళన మనసులో బయల్దేరినప్పుడు ధనాత్మకమైన ప్రత్యాశాభావాలను ఉత్సాహంగా పెంచుకోవాలి. ఉల్లాసంగా నిత్యసంతుష్టిగా ఉండడం అలవర్చుకోవాలి. వెంటనే ఆందోలనలు ప్రకకు తొలగిపోతాయి. ఆందోళనకు వ్యతిరేకంగా ఉండే నిశ్చింత, సంతోషం, సహృదయత, నిష్కాపట్వం, ఉల్లాసం, ధైర్యం, ప్రత్యాశ మొదలైన వాటిని ప్రవృద్ధి చేసుకోవాలి.

మనసు ఓ దివ్యాత్మ మందిరంగా వెలుగొందాలంటే ఆందోళనను వెంటనే అరికట్టుకోవాలి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: