telugudanam.co.in

      telugudanam.co.in

   

కల్పనా శక్తి (క్రియేటివిటీ)ని పెంచడమెలా?

మంచి ఆలోచనలు, కల్పనలు కేవలం పిల్లలకూ, రచయితలకూ, కళాకారులకే సొంతం కాదు. నిజం చెప్పాలంటే ఆలోచన, కల్పన అన్నది ప్రతి ఒక్కరి మేధాసంపత్తిపై ఆధారపడివుంటుంది. ఈ కల్పనాశక్తిని మనం మనకు అనుకూలమైన విధంగా, లాభాన్ని తెచ్చేవిధంగా మలచుకోవచ్చు. తన కల్పనాశక్తి ఆధారంగా పేరుప్రఖ్యాతులు గడించిన సోమర్సెట్ మాం ఒకసారి "కల్పనాశక్తి కసరత్తువల్ల అధికమవుతుంది. అందరూ అనుకున్నట్లు కాకుండా యువకులలోకంటే అనుభవజ్ఞులైన వారిలోనే శక్తివంతమైన కల్పనలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి" అన్నాడు. పూర్వకాలంలో నివశించిన వారంతా ఆలోచనాపరులే, కల్పనాశక్తిసంపన్నులే. వారు సృజనాత్మకమైన ఆలోచనల ఫలితమే మనం ఈ రోజు వాడుతున్న ముద్రణాలయం, విద్యుచ్చక్తి, బల్బు, రేడియో, అంతరిక్ష వాహనాలు మొదలైనవి. ప్రస్తుతం మనకున్న కల్పనాశక్తిని వృద్ధిపరుచుకుంటే పైన చెప్పిన సాధనాలను తప్పక వెలుగులోకి తీసుకొచ్చి మానవాళికి సహాయం చేయవచ్చు.

కల్పనాశక్తిని వృద్ధి చేసుకునేందుకు కొన్ని ఉపయోగకరమైన సలహాలు:


మీ ఇల్లు: మీరు నివసిస్తున్న చోట్లోనే నివసించాలా? ఇంతకు మించిన చోట్లోనే నివసించాలా? ఇంతకు మించిన ఆరోగ్యకరమైన, ఆహ్లాదాన్నిచ్చే ప్రాంతంలో నివసించాలా? ప్రపంచం చాలా సువిశాలమైనది. మీ కల్పనా శక్తిని వాడుకోండి. పనిచేసే దిశలో ఇది మీరు చేయబోతున్న మొదటి అడుగు అవుతుంది. మీరు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి లోపలి భాగాన్ని ఎలా అభివృద్ధిపరచగలరు? సృజనాత్మకంగా ఆలోచించండి. కొంత ప్రయత్నం, కొంత ఉత్సాహం, మరికొంత డబ్బు కలిస్తే మొత్తం ప్రాంతాన్ని శోభాయమానంగా మార్చవచ్చును. అలాగే ఇంటి ఆవరణలోని పూదోట. తేవలసిన మార్పుల గురించి ఆలోచించండి. తరువాత వాటిని అమలుపరచండి.

మీరు చేస్తున్న పని:మీరు పని చేస్తున్న చోటులో ఉన్న పరిస్థితులను మార్చగలరా? మరింత అభివృద్ధిపరచగలరా? మీ యజమానికి మీరు ఇంకా ఉపయోగకరంగా ఉండగలరా? చేస్తున్న పనిలో సమయాన్ని కార్మికులను, వస్తువులను ఎలా పొదుపు చేయగలరు? సృజనాత్మకంగా ఆలోచించండి. మీరు ఇతరులకు ఉద్యోగమిచ్చేవారైతే మీ సిబ్బందిని మరింత సంతోషపెట్టడానికి, ఉత్పత్తిని పెంచడానికి మీరేమి చేయగలరో దాని గురించి ఆలోచించండి.

మీ సంబంధ బాంధవ్యాలు: మీ కల్పనా శక్తిని ముఖ్యమైన రంగంలో వాడండి. ఘర్షణను మీరు ఎలా తగ్గించగలరు? మీ స్నేహ గుణాన్ని ప్రదర్శించండి. ఏ మార్గాలను అవలంబించి మీరు మరింత మంచి భర్తగా లేక భార్యగా లేదా తల్లిగా లేదా తండ్రిగా మారగలరు? ఆలోచించి కార్యవంతులు కండి. ఆలోచనా శక్తి మొత్తం మీ ప్రపంచాన్ని మార్చగలదు.

మీరు సాధించిన విజయాలు: ఇక్కడ మీ కల్పనాశక్తిని ఉపయోగించండి. మీరు ఏమికావాలని ఉబలాటపడుతున్నారో అది అయినట్లు మీ మనసులో భావించి దాన్ని మీ కండ్ల ముందు ఉంచుకోండి. మీరు ఏమి చేయదలుచుకున్నారో దాన్ని చేయండి. చేయాలన్న లేదా కావాలన్న నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలదు. రోజూ మీ కంటి ముందు విజయాన్ని పొందుతున్న చిత్రాలను ఉంచుకోండి. ఇదివరకు మీరు మీ మనసుపై వ్యతిరేక చిత్రాలనే చిత్రించుకుని ఉంటారు. ఇక భవిష్యత్తులో అనుకూలమైన చిత్రాలనే చిత్రించుకోండి. కల్పనాశక్తిని మీ స్నేహితుడుగా స్వీకరించండి.

మీ వ్యక్తిత్వం: అవాంఛితమైన అలవాట్లు, ధోరణులను అధిగమించడానికి మీ కల్పనా శక్తిని వాడండి. మీరు ఏకాంతప్రియులు, మితభాషులు లేదా ముక్కోపి అయితే, నత్తితో బాధపడేవారు సిగ్గుపడేవారైతే ఈ లోపాలను అధిగమించడానికి ప్రయత్నించండి. ఇంతకుముంచు ఎదురైన పరాజయాలను గురించి మీ మనస్సు పాడుచేసుకోడానికి స్వస్తి చెప్పండి. రోజూ ఆత్మబింబాన్ని వృద్ధి చేసుకోండి. రహస్యంగా మీ మెదడులో మీరు పెంచుకుంటున్న ఆలోచనలు మీ నడవడికపై ఇప్పటికే తమ ప్రభావాన్ని చూపి ఉంటాయి. ఇదే మీ ప్రయత్నాలకు హద్దులను నిర్ణయించివుంటుంది. ఆవిధంగా మీ విజయాలకు కూడా అది హద్దును నిర్ణయిస్తుంది. మీ ఆత్మబింబాన్ని మార్చుకోండి. అప్పుడు మీ అలవాట్లలో వ్యవహారంలో మార్పు తానుగా వస్తుంది.

మీరు ఏ స్థానాన్ని చేరాలనుకుంటున్నారో ఆ స్థానానికి సంబంధించిన విశదమూ, పరిపూర్ణమూ అయిన చిత్రాలనూ చిత్రించుకుని మీ ముందు ఉంచుకోండి. ఈ చిత్రంపైనే మీ మనసును లగ్నం చేయండి. ఈ రోజు కాకపోతే రేపు మీరు మీ మనసులో పెంచుకుంటూ వస్తున్న ఆ స్థానాన్ని ఆక్రమించుకోగలరు.

-పార్థ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: