telugudanam.co.in

      telugudanam.co.in

   

మనశ్శాంతి

మనశ్శాంతి

మొదట మనస్సన నెట్టిదో విచారించిన తరువాత దాన్ని శాంతిపఱచు మార్గమునన్వేషింపవచ్చును. మనస్సనునది భగవదంశము. అది ప్రపంచవికారము నొందినపుడు మనస్సని, నిర్వికార స్థితినొందినపుడు ఆత్మయని పిలువబడును. సృష్టి స్థితిలయములు మనసులోనే యున్నవి. సుఖదు:ఖములు మంచి చెడ్డలు దానివల్లనే ఏర్పడుచున్నది. ఒక్క మాటలో చెప్పవలయునన్న సర్వము మనసే.

ప్రపంచమందు మానవాళి చేయు ప్రతి కర్మయును మనస్సును తృప్తి పరచుటకే, "కోటివిధ్యలు కూటికొరకే" యనునట్లు పెక్కు గురుభోధలం బడయుట, బ్రహ్మ విధ్యయందు ప్రావీణ్యతను పొంది సుజ్ఞానమును బడయుటను మనస్స్వాధీనతకొఱకేయని అనుటలో సంశయము లేదు. సాధారణంగా జీవితంలో ఏవేవో తలంపులు మానవుని మనసును కలత పుట్టుచుండుట సహజము. మనస్తృప్తి ఆయా వ్యక్తి యొక్క అభిరుచుల నాధారపడియుండును. సంపదయుండి కూడానొకడసంతృప్తిగానుండును. కడుపేదయైన నొకడు సంతృప్తిగా నుండును. ఊరూర తిరుగు భిక్షకులు పొందు తృప్తి మరియు శాంతి నొకచోట సంపదగలవాడు పొందడు. ఇట్టి శాంతి అశాంతులకు కారణము మన మన:ప్రవృత్తే అత్యాశచే అనేక వ్యవహారములను పెంచుకున్న వానికి జీవితంలో శాంతి అనునది తక్కువ. మనసు ఎన్ని వక్కలుగా విభజింపబడిన అంత యశాంతిని పొందుదుము. భవబందములను పెంచుట, తగ్గించుట యనునది మనసుపైననే యాధారపడియున్నది. మనస్సన సూక్ష్మరూపంలోనున్న తానే కావున తానే యన్నింటికి మూలము.

మానవుడు ప్రపంచంలో అనుకున్న కోరిక నెరవేరినచో మనసు శాంతిపడునని తాన్నిమిత్తము పాట్పడుచుండెను.తాననుకున్న కోరిక ఫలించిన మీదట మనశ్శాంతి కలుగునని యెంచుట వట్టి భ్రమ. ఒకవేళ కలిగినదని తను భావించినను అది తాత్కాలికమే. ఒక కోరిక తరువాత నొక కోరికను కోరుట మనసు యొక్క స్వభావము. ప్రపంచ ప్రవృత్తులలో రగుల్కొన్న మనసు, అది పొందు శాంతి శాంతి కాదు. ఒక క్షణములో శాంతి మరొక క్షణములో అశాంతి. ఇదియే లోకపు రీతి. ప్రపంచము బీరకాయపీచులాంటిది. ఒక చిక్కును విడదీయుసరికి మరొక చిక్కు ఎదురగును. మనసెప్పుడు ప్రాపంచిక చిక్కులను విడదీయుటలోనే సతమతమగును.

మనోవేగమునకు సాటియగు వేగమెందును లేదు. అది ఒక్క నిముసంబున పెక్కు యోజనంబులు పరుగిడి రాగలదు. కావున ఇట్టి మనసును స్వాధీనపఱచి ఆత్మయందు లీనమొనరించుట వల్లపు ప్రదేశమునుండి ఎత్తు ప్రదేశమునకు నడిచినట్లు తోచును. అందువల్ల మనసు గెలిచినవాడే మాన్యుడయ్యా యనుమాట చెప్పబడింది. ఒక్క మనసును స్వాధీనపఱచిన మనమెన్నింటినో సాధించినట్లు. కావున మనోనిగ్రహము మాయను దాటుచున్న వానికే సాధ్యమగును. మనస్సునకు నిశ్చలత్వమును, ఏకాగ్రత్వమును చేకూర్చవలయునన్నా జ్ఞానబోధను తప్ప వేరే దేని నుఱిగినను నిష్ప్రయోజనమే. అనగా యధార్థము బోధపడినప్పుడే మనశ్శాంతి కలుగును. ఆత్మవిధ్యవల్ల భ్రమలుడిగి తైలములేమిచే దీపమారినట్లు మనశ్చంచలత నశించి ఆత్మశ్శాంతి కలుగును. అనగా మనసునకు తన నిజరూపము గోచరించిన చంచలత్వము నశించును. జ్ఞానాన్ని ప్రజ్వలించినంతవరకు మనోనిశ్చలతకు భంగము లేదు. అందువల్ల ఎప్పుడును ఆరని జ్ఞానాగ్ని హృదయము నంటియుండవలయును. ఇందులకు అనుభవసహితమైన ఆత్మజ్ఞానము అవసరము. అనగా తనను తాను స్పష్టముగా గుర్తించి అటుపై మనసు నటులనే నిలుపవలయును.

మనసాత్మలో లయమగువఱకు కొన్ని నియమములను పాటించవలయును. ప్రపంచ విషయములపై అనురాగము చూపకుండిన మనశ్శాంతి చేకూరుచుండెను. అనగా అనురాగముచే దు:ఖమావేశమగును. దానిచే మనశ్శాంతి చెడును. విషయానురాగముచే ఆశలభివృద్ది చెందును. అట్టి ఆశలచే నభిమానము, అభిమానములచే అసంతృప్తి, అసంతృప్తిచే అశాంతి కలుగును. మనశ్శాంతికి ఏకాంతవాసము చేయుతనిచ్చును. మానవునందలి నైసర్గిక మరియు స్వాభావిక శక్తులను అభివృద్ది చేయు లేక నాశనము చేయునట్టి ప్రేరణల సముదాయమును పరిసరములందురు. కావున మానవుడు మంచి పరిసరములకై మమతను చూపవలెను. సద్గ్‌రంధపఠనము, సత్సంగము, సదుపన్యాసములను కలిగియుండవలయును. ప్రతిదిన మాత్మచింతనకు మరియు ధ్యాననిష్టలకు సమయమివ్వవలయును. నిద్ర పట్టుటకు ముందే ధ్యానమారంభించి ధ్యానమధ్యమున నిద్రావస్థనొందుట మిక్కిలి ఉత్తమము. ముఖ్యముగా నెట్టి సందర్భమునందైనను మనోదృష్టి యధార్థమును పాయకుండా నుండవలయును. జీవితమందు తానెదుర్కొను ప్రతి సమస్యను పరిపూర్ణ భావముచే (భేదరహితబిద్దుచే)పరిష్కరించుకొనవలయును.

మనో నిశ్చలతకై యాహారవిషయములపట్లగూడ శ్రద్దతీసికొనవలయును. ఆధ్యాత్మికోన్నతికై స్వల్పాహారము మరియు అప్పుడప్పుడు ఉపవాసదీక్షయును అవసరము. జితేంద్రియత్వమునకు జిహ్వాచాపల్యము నరికట్టుట ప్రధమ సోపానము. దుష్టాహారము మరియు నధికాహారముపట్ల ఆసక్తిని వదలవలెను. అప్పుడప్పు డుపవాసమువల్ల మనసు సున్నితమై స్వాధీనమందును, శరీరములకు బానిసలమైనచో జ్ఞానమునకు చెఱుపు కలుగును. ఒక దినము ఆహారము మానిన శరీరమునకెంత దాసులమై యుంటిమో తెలియును. కావున బ్రహ్మ ప్రాప్తికై ప్రయత్నించు వ్యక్తి మనో నిశ్చలత లభించునంతవరకు మాత్రము పై విషయముల నెక్కువగా పాటించవలెను. మొక్క బలపడునంతవరకు దాని చుట్టును కంచెను వేయుటగాని, తగు శ్రద్దతోనే జంతువు తినకుండా చూచుటగాని యుండవలెను. పెరిగి పెద్దదైన తరువాత దానిచుట్టు ఎన్ని జంతువులు తిరిగినను, ఎట్టి అశ్రద్దను చూపినను గాని దానికి చావులేదు. ఇదేవిధంగా మానవునికి మనోనిశ్చలత లభించి బ్రహ్మప్రాప్తి చేకూరిన తరువాత ఎచ్చట ఉన్నను, ఏమి జరిగినను మనోనిశ్చలతకు భంగము కలుగదు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: