telugudanam.co.in

      telugudanam.co.in

   

విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మెళకువలు

విశ్వాసం విజయావకాశాలను మెరుగు పర్చుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి, ఆనందాన్ని అందరికీ పంచి ఇవ్వడానికి కీలకమైన వనరు. ఇది ఆలోచనలనుంచి ఉధ్భవించినది కాబట్టి ఎవరికి వారు స్వయం కృషితో వృధ్ధి చేసుకోవచ్చు.విశ్వాసం తీగ లాంటిది. అది పాకడానికి స్థిరమైన పట్టుకొమ్మ కావాలి. విశ్వాసాన్ని వికసింపచేయడానికి బలమైన ధ్యేయం ఉండాలి. అందువల్ల ప్రతిఒక్కరికీ నిర్ధిష్టమైన జీవిత లక్ష్యం అవసరం. జీవిత లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా నిర్వచించుకోవాలి. లక్ష్యం అందుకోగలదిగా ఉండాలి.

ఒక లక్ష్యాన్ని సాధించిన తరువాత ఇంకొక లక్ష్యాన్ని నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని స్వల్పకాల లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఎప్పటికప్పుడు అందుకోగల లక్ష్యాన్ని నిర్ణయించుకుంటూ అంతిమ లక్ష్యం వైపు అంచెలవారీగా సాగిపోవాలి. స్వల్పకాల లక్ష్యాలను ముందుగా నిర్ణయించిన కొలమానాలతో సమీక్షించుకోవాలి. అంచనాలు వేసేటప్పుడే కాలాన్ని కూడా అందులో అంతర్భాగం చేయాలి. అంచనాలకు, సాధించిన ప్రగతికి మధ్య ఉన్న తేడాను ఎప్పటికప్పుడు ఆచరణాత్మకంగా సరిచూసుకొని సవరించుకోవాలి.


1.నిర్ధిష్ట లక్ష్యాలు ఉండాలి

లక్ష్యాలను నిర్ణయించేటప్పుడే వాస్తవాలకు దగ్గరగా అంచనాలు వెయ్యాముఖ్యంగా ఎవరి శక్తి సామర్ధ్యాలను వారు తమ గత ప్రగతిని దృష్టిలో పెట్టుకోని మదింపు చేయాలి. ప్రతి ఒక్కరికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. పూర్వ అనుభవాన్ని బట్టే బలహీనతల వ్యతిరేక బలహీనతలు దృష్టిలో పెటుకోవాలి. సామాన్యంగా చాలామంది తమ శక్తి సామర్ధ్యాలను ఎక్కువగా అంచనా కట్టుకొంటారు. తమ బలహీనతలను తక్కువగా మదింపు చేస్తారు. ఇట్టి లోపభుయిష్టమైన పధకాన్ని తయారు చేసుకోవటంవల్లనే అంచనాలకు, ప్రగతికీ మధ్య ఆచరణలో ఎదురు చూడని అగాధం ఏర్పడుతుంది. అప్పుడు భావావేశానికి లోనై తమ తప్పులను గుర్తించలేరు. అందువల్ల లక్ష్యాలను నిర్ణయించుకొనేప్పుడే అట్టి లోపాలను నివారించటానికి కృషి చేయాలి.

ఏ పనైనా చెయ్యటానికి మన వనరులతో పాటు ఇతరుల సహాయ సహకారాలు అవసరం. ఇతరులనుండి అందవలసిన సహాయ సహకారాలను ముందుగానే మదింపు చేసుకోవాలి. ఎవరి నుండి ఎటువంటి వనరు ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా అందాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఎదురు చూసిన సహాయం సంపూర్ణంగా లభించని యెడల తీసుకోవలసిన ప్రత్యామ్నాయ చర్యలను కూడా ముందుగానే ఊహించుకోవాలి. సంబంధిత వ్యక్తులతో అన్ని విషయాలనూ క్షుణ్ణంగా చర్చించి, స్పష్టమైన అవగాహనకు రావాలి.


2.ఆలోచించి అంచనాలు వేయాలి

లక్ష్యాలను సాధించాలంటే ప్రధమ దశలోనే అన్ని అంశాలను సంపూర్ణంగాను, సమగ్రంగాను అలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. ఆదిలోనే నిర్వహణలో ఎదురయ్యే అడ్డంకులను ఊహించుకోని అనిశ్చిత పరిస్తితులను విఙ్ఞతతో పరిష్కరించుకోవడానికి ప్రత్యామ్నాయ వ్యూహాలను సిధ్ధం చేసుకోవాలి. చేయవలసిన ప్రతి చిన్న పనిని చేస్తున్నట్లే భావించి మనోఫలకం పై చిత్రీకరించుకోవాలి. ఓపికతో నేర్పుగా ప్రతి అంశాన్ని అంతర్ముఖులై ఆలోచించి పూర్తి చేసిన అనుభూతిని పొందితే విశ్వాసం వృధ్ధి అవుతుంది.

ఆలోచనలకు, ఆచరణకు మధ్య ఉన్న తేడా అంచనా దశలోనే స్పష్టంగా మనోపలకంపై కనిపిస్తుంది. లక్ష్యాలను నిర్ణయించడంలోనూ, అంచనాలను తయారు చేయడంలోనూ, వ్యూహాలను ఖరారు చేయడంలోనూ, వనరులను సమీకరించడంలోనూ, ఎంత శ్రధ్ధ చూపిస్తే ఆచరణలో అంత వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా అనుభవఙ్ఞులతో సంప్రదించి వారు ఎదుర్కొన్న అనిశ్చిత పరస్థితులను గురించి తెలుసుకోవాలి. వారు చేసిన తప్పులు పునరావృత్తం కాకుండా ఉండటానికి తీసుకోవలసిన ముందు జాగ్రత్తలను గురించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలి. ఆధునిక విషయ పరిఙ్ఞానాన్ని, కావలసిన పరికరాల వివరాలను నిపుణుల నుండి సేకరించుకోవాలి.


3.అంతర్వాణి ప్రభావం

లక్ష్యాలను గూర్చిన పధకాలను తయారు చేస్తున్నప్పుడు మనస్సు అంతరాళంలో నుంచి సృజనాత్మకత పెల్లుబికి వస్తుంది. అనేక నూతన భావాలు మనస్పురణలోకి వస్తాయి. కొన్ని సమస్యలకు కలల రూపంలో పరిష్కారాలు లభిస్తాయి. మనపై మనకు విశ్వాసం ఉంటే అనేక అద్భుత అనుభవాలు కలుగుతాయి. తరచు అంతర్వాణి మనకు ఉపయోగకరమైన సూచనలను, సలహాలను ఇస్తుంది. మనకు అందే అంతర్గత ప్రేరణలను ఒక నోటు పుస్తకంలో నమోదు చేసుకొని సమీక్షించుకోవాలి.

లక్ష్యాలను నిర్ణయించుకునేటప్పుడు కొన్ని అపసవ్య ఆలోచనలు భీతిని, భయాన్ని కలుగజేస్తాయి. సాధ్యమయ్యే పనిలో కూడా సంక్షోభం ఉందనే భావాన్ని అపసవ్య ఆలోచనలు కలిగిస్తాయి. అవకాశాలను బీభత్స పరిస్థితులుగా చిత్రీకరిస్తాయి. వాటిని గుర్తించి వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. మనకృషి పట్ల సంతృప్తి కలిగి ఉంటే విశ్వాసం పెరుగుతుంది. మనం సాధించగలం అనుకొంటే ఉత్సాహం పెల్లుబికి వస్తుంది. మనసామర్ధ్యాలను మనమే శంకిస్తే మనం ముందుకు సాగలేం. సామర్ధ్యాన్ని పరీక్షకు పెట్టి, అంచలవారీగా పెంచుకుంటూ పోవాలి. సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి మనమీద మనకు విశ్వాసం ఉండాలి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: